వైశాఖ మాస విశిష్టత

మాసాలలో వైశాఖమాసం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోన్న కారణంగా ఈ మాసాన్ని మాధవమాసమని కూడా పిలుస్తుంటారు. అనేక శుభకార్యాలకు … దైవ కార్యాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తుంది. పరమ పవిత్రమైన ఈ మాసంలోనే పరశురాముడు జన్మించాడు. దశావతారాలలో పరశురాముడి అవతారానికి ఒక ప్రత్యేకత వుంది. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పరశురాముడు, అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి ఆయా క్షేత్రాల అనుగ్రహం భక్తులకు లభించేలా చేశాడు.

ఇక కన్నడ ప్రాంతంలో వీరశైవ వ్యాప్తికి అహర్నిశలు కృషిచేసిన బసవన .. భారతదేశాన్ని ఆధ్యాత్మికత నిండిన అమృత కలశంగా మార్చిన ఆదిశంకరాచార్యులు .. అనేక వైష్ణవ క్షేత్రాల్లో పూజా సంబంధమైన విధి విధానాలను ప్రవేశపెట్టిన శ్రీ రామానుజాచార్యులవారు .. వేల వేల సంకీర్తనలతో ఆ వేంకటేశ్వరుడిని అభిషేకించిన అన్నమాచార్యులవారు ఈ మాసంలోనే జన్మించారు. 

సింహాచలం నృసింహ స్వామివారి చందనోత్సవం … సమస్త సంపదలు అక్షయమై నిలిచేలాచేసే అక్షయ తదియ … ప్రభు భక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడు జన్మించిన కారణంగా, హనుమజ్జయంతి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుగుతాయి. ఇలా ఎన్నో విశేషాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తూ వుంటుంది. ఇక కార్తీక మాసం … మాఘ మాసాల మాదిరిగానే ఈ మాసంలో చేసే నదీ స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది. 

శ్రీమహావిష్ణువు ఆదేశంమేరకు దేవతలందరూ తెల్లవారుజామున నీటిలో ఉంటారనీ, అందువలన ఆ సమయంలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. వీలైతే సముద్ర స్నానం .. లేదంటే నదీస్నానం .. అందుకు అవకాశం లేకపోతే బావి నీటినే పవిత్ర నదీ జలాలుగా భావించి స్నానం చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చిస్తూ … ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సకలశుభాలు చేకూరడమే కాదు, మోక్షాన్ని సాధించడానికి అవసరమైన అర్హత కలుగుతుందని చెప్పబడుతోంది.

వైశాఖ మాసంలోని శుభ తిథులు, పర్వదినాల వివరాలు
వైశాఖ శుక్ల పాడ్యమి  – 5, మే 2019, ఆదివారము – వైశాఖ మాస ప్రారంభం, Starting of Vaisakha masam
వైశాఖ శుక్ల తదియ – 7, మే 2019, మంగళవారము – అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం, Akshaya Trutiya, Simhachala Chandanotsavam
వైశాఖ శుక్ల పంచమి – 9, మే 2019, గురువారము – శ్రీ శంకర జయంతి, శ్రీ రామానుజ జయంతి, Shankara Jayanthi, Shri Ramanuja Jayanti  
వైశాఖ శుక్ల చతుర్దశి – 17, మే 2019, శుక్రవారము – నృసింహ జయంతి, Nrusimha Jayanthi
వైశాఖ శుక్ల పూర్ణిమ – 18, మే 2019, శనివారము – శ్రీ కూర్మ జయంతి, శ్రీ అన్నమాచార్య జయంతి, Shri Kurma Jayanthi, Annamaachaarya Jayanthi
వైశాఖ బహుళ చవితి – 22, మే 2019, బుధవారము – సంకష్టహర చతుర్థి, Sankashtahara Chaturthi
వైశాఖ బహుళ దశమి – 29, మే 2019, బుధవారము – శ్రీ హనుమ జయంతి, Hanumadjayanthi
వైశాఖ బహుళ త్రయోదశి – 1, జూన్ 2019, శనివారము – మాస శివరాత్రి, శని త్రయోదశి, Masa Sivaratri, Shani Trayodasi