రాముని గుణగణాలలో అత్యంత ప్రధానమైనది జిత క్రోధః అంటే కోపాన్ని జయించిన వాడు. కోపాన్ని జయించడం అంటే అసలు కోపం రాకపోవడం కాదు. తను కోపాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలో, తన కోపాన్ని ఎంత పరిమితంగా ఎవరిపట్ల వాడాలో తెలిసిన జ్ఞాని. ఏదైనా విషయం మనకి వ్యతిరేకంగా జరిగితే మనందరమూ వెంటనే కోపానికి వశులమైపోతాము. అవతలి వారి ప్రవర్తన మనము అనుకున్న రీతిలో లేకపోతే వెంటనే వారిని అనుమానించి, అవమానించే స్వభావం మనలో చాలామందిలో ఉంటుంది. అప్పటిదాకా మనతో సఖ్యంగా ఉన్నవారు ఏదైనా కారణంతో మనకి విరుద్ధంగా ప్రవర్తించగానే కోపంతో వారిని నానా దుర్భాషలాడతాము. అప్పటిదాక వారిలో ఉన్న మంచి స్వభావం గుర్తుకురాదు. ఎందుకలా ప్రవర్తించారో ఆలోచించము. మనమే కాదు రామాయణం లోనే, సాక్షాత్ లక్ష్మణ స్వామి, సీతా మాత కూడా అలా తొందరపడిన సందర్భాలున్నాయి. కైక రామచంద్రుని అరణ్య వాసం, భరత పట్టాభిషేకం అనే రెండు వరాలు కోరినప్పుడు, తల్లిదండ్రులని కూడా చూడకుండా కైకా దశరథులని, లక్ష్మణ స్వామి నిందిస్తాడు. అలాగే సీతామాత కూడా, సీతాపహరణానికి ముందు, మారీచుని మాయలో చిక్కుకుని, రామునికే కష్టం వచ్చినదనుకొని, కన్నబిడ్డ వలె చూసుకున్న లక్ష్మణుని నానా మాటలూ అంటుంది. కానీ శ్రీరామచంద్రుడు అలా కాదు. ఎంత కోపం వచ్చినప్పటికీ, రాముడు విచక్షణ కోల్పోయిన సందర్భాలు లేవు. మనం శ్రీరామచంద్రమూర్తి నుండి నేర్చుకోవలసినది అదే.

తనను అరణ్యవాసం చేయమన్న కైకను ఎందరు ఎన్ని విధాల దూషించినప్పటికీ, తాను మాత్రం తూలనాడలేదు. దశరధుడు, కౌసల్య, లక్ష్మణుడు, అయోధ్యాపురవాసులు ఆఖరికి కన్నకొడుకైన భరతుడు కూడా కైకను నిందిస్తారు. అయినా రాముడు వారందరినీ వారిస్తూ “ఇప్పటివరకూ కైక నన్ను కన్నకొడుకు కన్నా ఎక్కువగా ఆదరించింది. ఇప్పుడు మాత్రమే ఆమె ఇలా ప్రవర్తిస్తోందంటే దైవ నిర్ణయమే తప్ప వేరు కాదు. దశరథుడు కూడా ధర్మానికి, ఇక్ష్వాకు వంశ రాజుల సత్యనిష్ఠకు కట్టుబడి కైక కోరికలకు తలవంచాడే తప్ప, కామానికి వశుడై కాదు. తల్లిదండ్రుల మాటను గౌరవించాల్సిన ధర్మం తన మీద ఉంది” కాబట్టి తనకు పెద్దకొడుకుగా రాజ్యాధికారం ఉన్నా, అరణ్యవాసమే మిన్న అని అడవులకు వెళ్ళాడు.
భరతుడు రాముని అయోధ్యకు తీసుకురావడానికి తన మాతలతో, వసిష్టాది గురువులతో, పెద్ద సైన్యంతో అడవికి వస్తున్నప్పుడు, లక్ష్మణుడు కోపోద్రిక్తుడై భరతుడి మీద యుద్ధానికి సిద్ధపడినప్పుడు, రాముడు భరతుని పట్ల కోపం తెచ్చుకోకుండా అతని నిజాయితీని సరిగ్గా అంచనా వేసాడు. అధర్మం ఎవరు చెప్పినా రామునికి కోపం వస్తుంది. తండ్రి అయినా సరే, చనిపోయిన దశరథుని మాట మన్నించనక్కరలేదని జాబాలి అనే బ్రాహ్మణుడు చెప్పినప్పుడు, రామునికి కోపం వచ్చింది . కానీ తొందరపడకుండా శాంత వాక్యాలతోనే జాబాలిని ఖండించాడు.
సుగ్రీవుడు తనకి రాముడిచ్చిన వర్షాకాలం నాలుగు నెలల గడువూ పూర్తయినప్పటికీ, భోగాలలో మునిగి తేలుతూ, సీతాన్వేషణ ఇంకా మొదలుపెట్టక పోవడంతో, రామునికి కోపం వస్తుంది. కానీ రాముడు “మిత్రుడు కాబట్టి మెల్లగా చెప్దాము, ఒక అవకాశం ఇద్దాము. అయినా వినకపోతుంటే అప్పుడు వాలి వెళ్ళిన దారిలోనే నిన్నూ పంపిస్తాము” అని చెప్పి రమ్మని లక్ష్మణుని పంపిస్తాడు. అదే వాలి అయితే అధర్మాన్నే పాలించాడు కాబట్టి ఇంక హెచ్చరికలు లేక శిక్షిస్తాడు. ఇక్కడ సుగ్రీవునిది కర్తవ్య నిర్వహణా లోపం, వాలిది అధర్మం. కర్తవ్య నిర్వహణలో పొరపాటు సహించవచ్చు కాని, అధర్మాన్ని మాత్రం సహించకూడదని రాముడు తన చేతలతో చెప్పాడు.

పై మూడు సంఘటనలలో రాముడు ఎవరిమీద కోపం తెచ్చుకోకూడదో, కోపం వచ్చినా దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో చెప్తున్నాడు. తల్లిదండ్రులు ఎంత అయిష్టమైన విషయాలు చెప్పినప్పటికీ, వారి మీద కోపం తెచ్చుకొనే అధికారం బిడ్డలకు లేదు. ఈనాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు, అగ్నికి ఆజ్యం తోడైనట్లు, మన సినిమాలు, మీడియా కూడా తల్లితండ్రులను ఎదిరించడం, వారి మాట ధిక్కరించడమే గొప్ప విషయాలన్నట్లు చూపిస్తున్నారు. దాని ప్రభావంతో పిల్లలు కూడా అనుకరిస్తున్నారు. ఈనాడు ఇన్ని వృద్ధాశ్రమాలు రావడానికి కారణం కూడా తల్లిదంద్రుల యెడ దయలేని పుత్రుల వల్లనే కదా, అందుకే వేమన తన శతకంలో తల్లిదండ్రుల యెడ దయలేని పుత్రుడు పుట్టనేమి? వాడు గిట్టనేమి? అన్నాడు. అంతే గాకుండా బ్రాహ్మణుల మీద కూడా కోపం తెచ్చుకోకూడదు. వారు ఎంత అధర్మమైన విషయం చెప్పినప్పటికీ వారి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు. అలాగే మిత్రులైన వారి మీద కూడా వారి మిత్రత్వాన్ని అనుసరించి, వారి యందు దోషాలు ఉన్నప్పటికీ, వారికి మంచి చెప్పాలే తప్ప, వారి మీద ద్వేష భావం , కోపం ప్రదర్శించకూడదు.

సీతాపహరణం తర్వాత రాముడు విపరీతంగా దుఃఖిస్తాడు. అమితమైన కోపం వస్తుంది. ఆ కోపంలో లోకాలన్నింటినీ నాశనం చేస్తానని ధనుస్సు ఎత్తుతాడు. కానీ లక్ష్మణుని మాటలతో శాంతపడి, సీతని వెతకడానికి ఉద్యుక్తుడవుతాడు. కోపంలో ఉన్నవాడికి ఉండవలిసిన లక్షణం ఇది. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లు తనకన్నా చిన్నవాడైనప్పటికీ లక్ష్మణుడి మాట మన్నిస్తాడు. మనకి సాధారణంగా కోపం వచ్చినప్పుడు ఎవరి మాటా వినము. మంచి చెప్పినా తలకెక్కించుకోము. ఇలాంటిదే మరో సంఘటన సముద్రం మీద వారధి కట్టేముందు, సముద్రాన్ని దాటడం కోసం ఎంత ప్రయత్నించినా కుదరక పోయేసరికి, సముద్రాన్ని ఎండగొడతానంటూ ధనుస్సు ఎత్తుతాడు. అప్పుడు సముద్రుడు రాముని ప్రార్థించగా శాంతిస్తాడు. కోపం రావడం కన్నా వచ్చిన కోపాన్ని ఉపశమింపచేయడంలోనే మహనీయత్వం దాగుంది.

రాముడు ఎవరిపట్లా అసూయ లేనివాడు. తనకి చెందాల్సిన రాజ్యం కైక వరాల కారణంగా భరతునికి వెళ్లి పోతున్నప్పుడు కూడా రాముడు భరతుని పట్ల అసూయ చెందలేదు. సంతోషంగా , స్వచ్చందంగా దైవ నిర్ణయంగా భావించి రాజ్యాన్ని వదులుకున్నాడు.

అలాగే రాముడు రావణ సంహారం తరువాత తాను జయిన్చినప్పటికీ ఆ రాజ్యాన్ని తాను కోరుకోక తన శత్రువు తమ్ముడైన విభీషణునికే ఇచ్చి పట్టాభిషేకం చేస్తాడు. రావణుని అంత్యక్రియలు శాస్త్రోక్తంగా నిర్వహించుకోవడానికి అనుమతినిస్తూ రావణునితో వైరం రావణవధ తోనే ముగిసిపోయింది. ఇప్పుడు నాకు ఏమీ శత్రుత్వం లేదు అంటాడు. ఈ చిన్న జీవితంలో శాశ్వత శత్రుత్వం వల్ల సాధించేదేమీ లేదని మనం తెలుసుకోవాలి. దురదృష్ట వశాత్తూ మన మీడియాలో అంతా కూడా ఈ ద్వేషాలూ, కోపాలూ, పగలూ ఎక్కువ చూపిస్తున్నారు. మనం వాటి వలలో పడకూడదు. రాముని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. అనవసరంగా ఎవరి మీదా కోపం తెచ్చుకోకుండా, ఎవరినీ ద్వేషించకుండా అవసరమైనప్పుడు అంటే అధర్మాన్ని ఖండించాల్సినప్పుడో, ఎదుటి వాళ్ళ మంచి కోసమో, పరిమితంగా కోపం ప్రదర్శించడం ఒక్కోసారి అవసరమే అయినా, ద్వేషం అయితే అస్సలు ఉండకూడని గుణం.

ఆ శ్రీరామ చంద్రుడు మనలోని అసూయా ద్వేషాలని రూపు మాపి మన మనసుల యందు శాంతిని నెలకొల్పు గాక |

శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ||