శ్రీరాముని పరాక్రమం – ఆచరణ సాధ్యం

వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిన రాముని షోడశ గుణాలలో పరాక్రమం ముఖ్యమైనది. రామాయణంలో మనకు శ్రీరామ పరాక్రమం తాటక సంహారం తో ప్రారంభమై , రావణ సంహారం వరకు అడుగడుగునా తెలుస్తూనే ఉంటుంది. తాటకా సంహారం, విశ్వామిత్ర యాగ రక్షణలో మారీచ శిక్ష , సుబాహు వధ, శివ ధనుర్భంగం, అరణ్య వాసంలో ఖర, దూషణ, త్రిశిరుల ఆదిగా గల రావణ సేనని మట్టుబెట్టడం, మారీచ వధ, కిష్కిందా కాండలో వాలి నిగ్రహణం, చివరికి రావణ సంహారం, ఇలా ప్రతీ చోటా మనకి శ్రీరామ పరాక్రమం విదితమౌతూనే ఉంటుంది. అయితే మనం గమనించాల్సింది రాముని యుద్ధం అధర్మం మీదనే కానీ, శత్రువంశంలో ఉన్నప్పటికీ ధర్మవర్తనులైన వారిని కాపాడటంలో వెనుతీయడని మనకి విభీషణుని కథ ద్వారా తెలుస్తుంది. ధర్మ సంస్థాపన కోసమే రాముని పరాక్రమం.

రాముడు తనకి పరాక్రమం ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పరాక్రమాన్ని ప్రదర్శించలేదు. నిష్కారణంగా ఏ ఒక్కరినీ హింసించలేదు. అధర్మంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు మాత్రమే, అదీ అవసరమైనప్పుడు మాత్రమే తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. కైక వరాలు కోరి రాముడిని అరణ్య వాసం చేయమన్నప్పుడు , లక్ష్మణుడు కోపోద్రిక్తుడై , రాముడిని పరాక్రమం ప్రదర్శించి రాజ్యాన్ని తన వశం చేసుకోమన్నప్పుడు, రాముడు దానికి అంగీకరించక తన పరాక్రమం చూపే సందర్భం అది కాదనీ, తండ్రి మాట ప్రకారం అరణ్యాలకు వెళ్ళడమే తన ధర్మమనీ అంటాడు. అదే రాముడు అరణ్య వాసం లో ఉన్నప్పుడు, శూర్పణఖ చేత ప్రేరేపితులైన ఖరదూషణాది రాక్షసులు రాముడి మీద యుద్ధానికి వచ్చినప్పుడు 14,౦౦౦ మంది రాక్షసులని ఒక్కరోజులో తానొక్కడే హతమార్చాడు.

శ్రీరాముడు రాక్షస సంహారం చేస్తున్నప్పటికీ , తాను కోసల రాజ్య ప్రతినిధిని అని, తమ రాజు భరతుడని చెప్పుకున్నాడు. అంటే తాను ధర్మానికి ప్రతినిధిని అనీ, ధర్మాన్ని రక్షించి, రఘువంశ రాజుల ప్రతిష్ట నిలపాల్సిన బాధ్యత తనమీద ఉందనీ చెప్పాడు. రాముడు దేవతలని కూడా యుద్ధ రంగంలో ఎదుర్కోగలిగిన పరాక్రమం కలిగిన వాడని నారద మహర్షి చెప్తారు. తాను నరుడిగా అవతరించాడు కాబట్టి మానవుడిగానే ప్రవర్తించాడు. అసలు రామావతార ప్రయోజనమే మానవుడి శక్తిని లోకానికి చాటడం. అంటే అవతలివారు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, అధర్మ వర్తనులయితే లేదా అధర్మ పక్షాన ఉన్నా కూడా రాముడు సహించకుండా ఎదుర్కొనేవాడు. రావణాసురుడు ఎంతో శివ భక్తి పరాయణుడు, దేవతలను ఓడించగల పరాక్రమం ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు , కుబేరుని ఓడించి పుష్పక విమానాన్ని సాధించినవాడు ఐనప్పటికీ, తనలోని కామమనే దుర్గుణాన్ని జయించలేక అధర్మ మార్గాన నడిచాడు. కాబట్టి, అంతటి పరాక్రమ వంతుణ్ణీ రాముడు సంహరించాడు.

అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది, ఆచరణలో పెట్టాల్సింది ఏముంది? రాముడు క్షత్రియుడు, రాజ్య రక్షణా భారం తనపై ఉంది కాబట్టి, రాక్షసులని సంహరించాడు. క్షత్రియులకి సహజ ధర్మాలైన పరాక్రమం, యుద్ధరంగంలో దేవతలనైనా ఓడించగల వీరత్వం రామునిలో మహోన్నతంగా విలసిల్లాయి. శ్రీరాముడు విశ్వామిత్రుడిని అనుగమించి, గురు శుశ్రూష చేసి అనేకానేక అస్త్ర శస్త్రాలను సంపాదించుకున్నాడు. ప్రస్తుత కాల మాన పరిస్థితులని బట్టి, మనం కత్తి పట్టి యుద్ధాలు చేసి మన పరాక్రమం ప్రదర్శించుకునే అవకాశం, అవసరం ప్రతీ ఒక్కరికీ రాదు, ఎక్కడో సరిహద్దుల్లో యుద్ధాలు చేసే సైన్యానికీ, అప్పుడప్పుడూ దుర్మార్గులని శిక్షించే పోలీసు శాఖ వారికీ తప్ప. ఈనాడు వారే వృత్తిధర్మాన్ని బట్టి క్షత్రియులు. మనకున్న వర్ణ ధర్మాలని బట్టి, మన సహజ స్వభావాన్ని బట్టి మన స్వధర్మాలు ఏర్పడతాయి. జననాన్ని బట్టి మాత్రమే కాక మనం చేసే కర్మలు (వృత్తులు) ని బట్టి కూడా ధర్మాలు ఏర్పడతాయి. స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః అన్నట్లు ఏఏ వృత్తులలో ఉన్నప్పటికీ, ఏ ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పటికీ, అధర్మానికి తావివ్వకుండా, ధర్మమే లక్ష్యంగా పనిచేయాలి. రాముడు తన స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చడంలో ఏనాడూ తన అలసత్వాన్ని ప్రదర్శించలేదు. అది కూడా పరమ ధర్మానికి లోబడే చేసాడు. ధర్మ సంస్థాపనే తన లక్ష్యంగా పనిచేసాడు. ఉపాధ్యాయ వృత్తి , న్యాయవాద వృత్తి, వైద్య వృత్తి , వ్యాపారం ఇలా ఏ వృత్తి లో ఉన్నప్పటికీ, మన వృత్తులకు అనుగుణంగా ధర్మానికి ప్రతినిధులుగా నిలబడి, ఎక్కడ అధర్మం ఉన్నా ఖండిస్తూ, సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ, పాటించడమే నిజమైన పరాక్రమం.

అవతలి వ్యక్తి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ప్రలోభాలకు, భయాలకు లొంగకుండా అధర్మాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మనం సంపాదించుకోగలగాలి. అధర్మాన్ని ఖండించడానికి మనం వెనుకాడకూడదు. చరిత్రలో ఇలాంటి పరాక్రమవంతులని మనం చాలామందిని చూసేము, శివాజీ, ఝాన్సీలక్ష్మీబాయి, రాణి రుద్రమ మొదలైనవారు. సత్యాగ్రహంతో అధర్మాన్ని ఖండించి, తాననుకున్న స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్మా గాంధీ కూడా పరాక్రమవంతుడే.

మనందరం కూడా ధర్మ సంస్థాపనకై కృషి చేయగల ధైర్యాన్ని ఆ కోదండరాముడు మనకి ప్రసాదించాలని కోరుకుందాం.

లోకాభిరామం రణరంగ ధీరం, రాజీవ నేత్రం రఘువంశ నాథం|
కారుణ్య రూపం కరుణాకరంతం , శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||