సీతారామ కళ్యాణం – కడు రమణీయం

చైత్రమాసం వచ్చిందంటే చాలు, చెట్లు కొత్త చిగుర్లు వేస్తాయి, కోయిలలు గొంతె త్తి కమ్మగా పాడతాయి, ప్రతీ చోటా ఉత్సాహమే. ఆ ఉత్సాహంలో ఉత్సవం సీతారామ కళ్యాణం. ఆ కళ్యాణం జగత్కళ్యాణం. ప్రతీ ఇంటా తమింట్లోనే పెళ్ళి జరుగుతున్నంత సందడి. అందరూ “మా రామయ్య పెళ్ళికొడుకాయనే, మా సీతమ్మ పెళ్ళికూతురాయనే “ అని పాటలు పాడుకుంటారు.

వాల్మీకి మహర్షి విరచితమైన రామాయణాన్ని ఆనాటి నుండీ ఈనాటి వరకూ ఎందరెందరో మహనీయులు అనేక కోణాల్లో దర్శించారు. ఆ మహర్షి దర్శించి మనకి అందించిన రామాయణ రహస్యాన్ని ఎందరో ఋషులు, మహాత్ములు శోధించారు. ఎందుకు మనం రామాయణాన్ని పఠించాలో, సీతారామ కళ్యాణంలో ఉన్న పరమార్థం ఏమిటో, ఎందుకు మనం ప్రతీ సంవత్సరం సీతారామ కళ్యాణం జరుపుకోవాలో తెలియచెప్పారు. రామాయణంలోని అనేక తత్త్వములను వెలికితీసి మనకి అందించారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం వెనుక ఉన్న పరమార్థాన్ని వారు దర్శించి, మనకి అందించిన కొన్ని విషయాలను సవినయంగా మీతో పంచుకుంటున్నాము.

వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని సీతారామకళ్యాణ ఘట్టాలను ఒక క్రమపద్ధతిలో పరిశీలిస్తే లోకకళ్యాణ కారకమైన ఒక విషయం విదితమౌతుంది. రాముడు మిథిలానగరానికి చేరుకునేముందు అహల్యా శాపవిమోచనం జరుగుతుంది. అహల్య అనగా దున్నటానికి వీలుగా లేని భూమి అని అర్థం. హలము అంటే నాగలి కదా! అంటే నాగలిచే దున్నటానికి వీలుగా లేని భూమిని శ్రీరాముడు తన పాదస్పర్శచే పావనం చేస్తాడు. రాముడు నీలమేఘశ్యాముడు. నీలమేఘుడు అనగా వర్షించడానికి సిద్ధంగా ఉన్నవాడు. సీత అనగా నాగేటిచాలు నుండి పుట్టినది. జనకమహారాజు నాగేటిచాలుచే భూమిని దున్నగా అందులోనుండి పుట్టినది సీత. రాముడు సీతని కలవడానికి ముందు శివధనుస్సుని విరుస్తాడు. వర్షం వచ్చినప్పుడు ఏర్పడే హరివిల్లే శివధనుస్సు. ఆ సీతారాముల కలయికచే పుట్టినవారే లవకుశులనే వరిమొక్కలు(కుశము అంటే దర్భ, గడ్డి అనే అర్ధం ఉంది కదా!) అంటే నాగేటిచాలు వలన దున్నబడిన భూమి నుండి ఉద్భవించిన సీత కోసమై నీలమేఘశ్యాముడైన రాముడి ఆగమనంతో (వర్షాగమనంతో) పంటలు పండుతాయి. ఇది ప్రతీ సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. అలా జరుగుతూ ఉన్నంతకాలం ప్రాణికోటి మనుగడ ఉంటుంది. అందుకే మహర్షి అన్నారు, ఈ భూమి మీద రామాయణం ఉన్నంతకాలం సృష్టి ఉంటుందని. అందుకే ప్రతీసంవత్సరం వర్షం కురవాలని, పంటలు పండాలని కోరుకుంటూ సంవత్సరంలో తొలిఋతువు, పుష్పించే కాలము అయిన వసంతఋతువు, చైత్రమాసంలో ఆ సీతారామకళ్యాణం చేసి ప్రార్థిస్తాము. పంట పండించే ప్రతీ రైతూ జనకుడే, వాళ్ళు ప్రతీ ఏటా చేసేది ఆ సీతారామకళ్యాణమే.
ఇంకొక మహనీయుడు ఇందులోని ఆధ్యాత్మికతత్త్వాన్ని వెలికితీశారు. మనలోని ఆత్మే రాముడు. ఆ ఆత్మయొక్క శక్తే సీతమ్మ. మనలోని అహంకారం అనే రావణాసురుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనే పదితలలతో మనలోని ఆ ఆత్మశక్తిని అపహరించి మన ఆత్మారాముడు తన శక్తిని తెలుసుకోకుండా అడ్డుపడుతున్నాడు. అప్పుడు మనం ప్రాణాయామ స్వరూపమైన వాయుపుత్రుని సాయంతో మన శక్తిని మనం తెలుసుకోవడమే సీతారామ కళ్యాణం. అదే విశ్వమానవకళ్యాణానికి నాంది.

“ ఓం పూర్ణమదః పూర్ణమిదం ..” అన్న ఉపనిషద్వాక్యం ఆధారంగా ఈ లోకమే పూర్ణం నుండి ఉద్భవిస్తుంది. అట్లా పుట్టినది కూడా పూర్ణమే అయి వుంటుంది. ఈ సృష్టి కొనసాగడానికి పూర్ణత్వమే ఆధారము. సీతారామకళ్యాణమే ఒక పూర్ణత్వం. సీతారాములు ఈ లోకంలోనే ఆదర్శదంపతులు. జనకుడు సీతాదేవిని కన్యాదానం చేస్తూ, “నా కుమార్తె సీత నిన్ను ఛాయలా అనుసరిస్తుంది రామా “ అంటాడు. ఒక భార్య, భర్తను ఎట్లా అనుగమించాలో, ఒక భర్త, భార్యను ఎట్లా ఆదరించాలో ఆచరించి చూపిన ఆదర్శదంపతులు. రాముడి కోసం సీత, సీత కోసం రాముడు బ్రతికారు. అందుకే మన వివాహాల్లో “జానక్యాః కమలామలాంజలి పుటే యాః …” అనే శ్లోకం తోనే, ఆహ్వాన పత్రిక మొదలవుతుంది . కొత్తజంటను సీతారాముల్లా బ్రతకండి అంటారు. వివాహం మనిషి జీవితానికి నిండుతనాన్ని తీసుకొస్తుంది. అలా వివాహం ద్వారా పూర్ణత్వాన్ని సిద్ధింపచేసుకున్న మానవుడు, ఈ లోకంలో తన పాత్ర గుర్తెరిగి పత్నీసమేతంగా లోకకళ్యాణం కోసం కృషి చేయాలి. అందుకే వేదవిహితమైన కర్మలన్నింటిలో ధర్మపత్నిని తప్పనిసరి చేసారు. ఈ విషయాన్ని గుర్తించలేక ఈనాడు కొంతమంది చిన్న చిన్న కారణాలకే విడాకులు కోరుతున్నారు.

వాల్మీకి రచించిన సీతారామకళ్యాణ ఘట్టం మనకి వివాహం అంటే ఏమిటో, వివాహంలో ఇరుపక్షాలవారూ ఎలా నడుచుకోవాలో, వివాహానికి ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకోవాలో, వివాహ పరమార్థం ఏమిటో తెలియచెప్తుంది. వివాహం చేయగోరే పెద్దలు, వివాహం చేసుకోబోయే యువతీయువకులు పెళ్ళికి ముందు సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, వివాహసమయంలోనూ, వివాహం అయిన తరువాత వారి దాంపత్యజీవితంలోనూ ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటారు. అప్పుడు మ్యారేజ్ కౌన్సిలింగ్ సెంటర్ల అవసరమే ఉండదు.

ఇక సీతారామకళ్యాణ ఉత్సవం మనకి భారతదేశమంతటా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఆ కళ్యాణంలో అమ్మవారు, అయ్యవారు పోసుకున్న తలంబ్రాలు మనము ప్రసాదంగా శిరసున ధరిస్తే అదే మనకి శ్రీరామరక్ష. ఈ పండుగరోజు మనకు ప్రసాదంగా పంచే వడపప్పు, పానకం వెనుక ఒక ఆరోగ్యరహస్యం కూడా దాగుంది. చైత్రమాసం నుండి ఎండలు ఎక్కువ అవుతాయి. వేసవి వేడిమి పెరుగుతుంది. ఆ వేడిలో చల్లదనాన్నిచ్చే పెసరపప్పు, బెల్లంపానకం స్వీకరించడం వలన ఆ వేసవితాపం నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా లౌకికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని తరింపచేసే సీతారామకళ్యాణాన్ని భక్తిభావంతో వీక్షించగల అదృష్టం ఆ జానకీవల్లభుడు మనకు ప్రసాదించుగాక!