సింహాచల నృసింహస్వామి చందనోత్సవం

సింహాచలం శ్రీవరాహా లక్ష్మీనృసింహస్వామి(అప్పన్న) ప్రతి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి దేహం పైనున్న చందనాన్ని బంగారుబొరిగెలతో ఆలయ అర్చకులు తొలగిస్తారు. తదుపరి గంగధార నుంచి తీసుకొచ్చిన జలాలతో అభిషేకించి అర్చన చేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలతో మిళితం చేసి సిద్ధం చేసిన పచ్చిచందనాన్ని స్వామికి సమర్పిస్తారు. తిరిగి రాత్రి వెయ్యి మంది రుత్వికులు తీసుకొచ్చిన ప్రత్యేక జలాలతో స్వామికి అభిషేకిస్తారు. ఆ తరువాత సహస్ర ఘటాభిషేకం నిర్వహించి మూడు మణుగుల చందనాన్ని (125 కిలోలు) స్వామికి సమర్పిస్తారు. దీంతో నిజరూపం నుంచి స్వామి తిరిగి నిత్యరూపంలోకి వస్తారు.

Picture Courtesy – Google

ఇక్కడ కనిపించే వరాహ ముఖం, మానవశరీరం, సింహతోకతో కూడిన స్వామివారి శరీరం మరెక్కడా కనిపించదు. ఇక్కడి ప్రజలు స్వామివారిని “సింహాద్రి అప్పన్న” అని పిలుస్తారు.

మూలవిరాట్టు:

మూలవిరాట్టు ‘వరాహనరసింహ’ ప్రహ్లాద మందిరం మధ్యలో చందనపూతతో, లింగాకారంలో దర్శనమిస్తాడు. ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది. ఏడాదిలో ఒక్క అక్షయతదియ (వైశాఖశుద్ధ తృతీయ) రోజు మాత్రమే కొద్ది గంటలసేపు స్వామివారిపై ఉన్న పూతను ఒలిచి, నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. అప్పుడు త్రిభంగి భంగిమలో రెండుచేతులతో, వరాహ ముఖంతో, నరుని శరీరంతో, సింహ తోకతో స్వామివారు దర్శనమిస్తారు. మూలవరులకి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. పద్మాసనంలో కూర్చుని, చేతిలో పద్మంతో అభయ వరద ముద్రలో ఉన్న చతుర్భుజ తాయారు (లక్ష్మీ)కి, ఆండాళ్ సన్నిధులు ఉన్నాయి.

ఆలయంలో స్వామివారి ప్రధానోత్సవాలు :

ఆగమ శాస్త్రం మరియు శిష్టాచార సాంప్రదాయం ప్రకారం ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి. కల్యాణోత్సవం, చందనోత్సవం, ధనుర్మాస ఉత్సవం, వారోత్సవం, మాసోత్సవం జరుపుతారు. చందనయాత్ర వీటిల్లో అతి ముఖ్యమైనది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలలనుండి భక్తులు వస్తారు. వైశాఖ మాసంలోని అక్షయతృతీయ రోజు ఈ ఉత్సవం చేస్తారు. ఇది శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు. ఈ రోజు స్వామికి చందనం సమర్పించినవారికి, దర్శించినవారికి మోక్షం, ఆనందం కలుగుతాయి. స్వామివారి చందనం తెల్లవారుఝామున తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం తరువాత సాయంత్రం మళ్ళీ చందనపూత వేస్తారు. పన్నెండు మణుగుల చందనం స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు. అవి నరసింహ జయన్తి, ఆషాడ శుద్ధపూర్ణిమ, జ్యేష్ఠ శుద్ధ పూర్టిమ.

శ్రీవరాహ స్వామికి, శ్రీనరసింహునికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలం సింహాచలం ఒక్కటే. రెండూ స్వామివారి ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచారనే అభిప్రాయం ఉంది.