రామో విగ్రహవాన్ ధర్మ:

రాముడు రాశీభూతమైన ధర్మం. సత్యమే రాముని ధర్మము. ఏ మహానుభావుడికో, ఏ కొద్దిమందికో మాత్రమే సాధ్యమయ్యే ధర్మాన్ని, రాముడు ఆచరించలేదు. సామాన్యులు సైతం సులువుగా ఆచరించగలిగే ధర్మాన్నే ఆచరించి చూపాడు. అందుకే రాముడు అందరికీ ఆదర్శప్రాయుడైనాడు.

రామునికి ధర్మ సూక్ష్మాలన్నీ తెలుసు. సీతా పరిణయమప్పుడు, శివ ధనుర్భంగం కాగానే జనకుడు సీతని కన్యాదానం చేయబోవగా, రాముడు కోడలిని నిర్ణయించాల్సిన బాధ్యత తన తండ్రి గారైన దశరథునిదనీ, ఆయన అంగీకరిస్తేనే వివాహమాడతాననీ చెప్తాడు. మరొక సందర్భంలో కౌసల్య కూడా రామునితో అరణ్యవాసానికి సిద్ధపడినప్పుడు, స్త్రీకి భర్త వద్ద ఉండడమే ధర్మమనీ, వృద్ధుడైన దశరథ మహారాజుని సేవించమనీ హితవు పలుకుతాడు.

రాముని జీవితంలో ఎన్ని సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ, రాముడు ఏనాడూ సంఘర్షణకి లోనవలేదు. తాను ఏమి చేస్తే ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారో, ఇక్ష్వాకు వంశప్రతిష్ట నిలబడుతుందో, దానినే చేసాడు. ఎందరు ఎన్ని చెప్పినప్పటికీ త(న)ను ధర్మం నుండి వైదొలగలేదు. వేదాలు, శాస్త్రాలు ఏది ప్రమాణంగా చెప్పాయో దానినే రాముడు ప్రమాణంగా స్వీకరించాడు. కానీ, మనందరమూ మన అంతరాత్మ ప్రభోదాన్నే ప్రమాణంగా తీసుకుంటూ ఉంటాము. తనకుమాలిన ధర్మం లేదన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటాము. వేదాలు, శాస్త్రాలు ఏమి చెప్పాయో అది చేయడం మాని, మన ప్రయోజనాలకి తగ్గట్లుగా కొత్త వాదనలతో ధర్మాలు నిర్మించుకుంటున్నాం.

రామాయణంలోని మిగతా పాత్రలు కూడా ధర్మాన్నే ప్రతిపాదించినప్పటికీ, వారు తమకనుకూలమైన ధర్మాన్నే చెప్తారు. కైక కూడా దశరథునితో ఆడిన మాట తప్పకపోవడమే ధర్మమని వాదిస్తుంది. అలాగే లక్ష్మణుడు కూడా అధర్మపరుడైన రాజు చెప్పిన మాటని పాటించనక్కరలేదనీ, క్షాత్ర ధర్మంతో రాజ్యాన్ని సాధించవచ్చనీ కూడా వాదిస్తాడు. లక్ష్మణుడు, వసిష్టుడు తదితరులు ప్రతిపాదించిన ధర్మాన్ని అనుసరించీ మరియు అయోధ్యా ప్రజలందరి కోరిక మేరకు క్షత్రియ ధర్మం అనుసరిస్తే రాముడు తానే రాజు అయి ఉండేవాడు. కానీ రాముడు క్షత్రియ ధర్మాన్ని అనుసరించక సామాన్య పౌర ధర్మాన్ని అనుసరించాడు. అదే అన్నింటికన్నా ఉత్తమమనుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ రాముడు అప్పుడే కనుక రాజయి ఉంటే, తన తండ్రి, మహారాజు అయిన దశరథుని మాట మన్నించక పోతే, ప్రజలు కూడా రాజైన రాముని మాటలు లెక్క చేయరేమో అని సందేహ పడ్డాడు. తల్లి తండ్రులను గౌరవించాల్సిన బాధ్యతను తానే పాటించకపోతే తన ప్రజలెలా పాటిస్తారని ప్రశ్నిస్తాడు.

తను ఏది ఆచరిస్తే అయోధ్యా ప్రజలు అనుసరిస్తారో, ఆదర్శ ప్రాయంగా తీసుకుంటారో దాన్నే రాముడు ఆచరించాడు. ఇక అరణ్య వాసానికి వెళ్ళిన తరువాత కూడా మునుల కోరిక మేరకు , స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని పాటించి వారిని బాధిస్తున్న 14 వేల మంది రాక్షసులని చంపాడు.

రాముడు తాను స్వయంగా అధర్మాన్ని చేయకపోవడమే కాదు, అధర్మపరులని కూడా సహించే వాడు కాదు. అందుకే బలవంతుడైనప్పటికీ, అధర్మపరుడైన వాలితో స్నేహం చేయక, సుగ్రీవునితో మైత్రి చేసాడు. అధర్మపరుడైన వాలిని సంహరించడం రాజులకు సమంజసమే అని చెప్పాడు. తాను భరతుని ప్రతినిధి అని, తమ రాజు భరతుడని, తమ రాజ్యంలో అధర్మపరులని శిక్షించడం ధర్మమేనని చెప్పాడు.

మనం కూడా వేదాలు, శాస్త్రాలు చెప్పిన దానినే ఆచరించాలి. ఒకవేళ అవి తెలియనిచో స్మృతులు చెప్పిన దానిని, అవి కూడా తెలియనిచో పురాణాలలో చెప్పినట్లుగానూ, అది కూడా తెలియక పోతే సదాచారము కలిగిన పెద్దలు చెప్పినట్లు చెయ్యాలి. ఇవేవి కుదరకపోతేనే అంతరాత్మ చెప్పినట్లు చేయవచ్చు. కానీ మనకు ఈనాడు ఏది ధర్మమో చెప్పే పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ, మనలో చాలామంది వారు చెప్పినది పాటించక తమకు అనుకూలమైనదే ధర్మమని వాదిస్తున్నారు, పాటిస్తున్నారు . దాని వల్ల తమకే కాక, తమవారికి కూడా సమస్యలు తెచ్చిపెడతున్నారు. అందరూ చేస్తున్నప్పుడు నేనొక్కడినీ ధర్మంగా ఉంటే మాత్రం ఏమి ఒరుగుతుంది? అనే ఉదాసీన భావం కూడా ప్రమాదాలని తెస్తోంది. ప్రతీ ఒక్కరం తానే ముందు ఉండాలనే భావంతోనో, విషయభోగాల మీద ఆసక్తితోనో, చిన్న చిన్న తప్పులు చేసినా ఫరవాలేదనో, మరీ పెద్దవైతేనే తప్పులనో, ఆపద్ధర్మం పేరు చెప్పో, ఇబ్బందులు పడాల్సి వస్తుందనో, బంధువుల మీద మమకారంతోనో అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఒకవేళ అలా ప్రవర్తించినప్పటికీ, పైకి మనం చేసింది ధర్మమే అని చెప్పినప్పటికీ, మన మనసులో శాంతిగా ఉండలేము. తాత్కాలికంగా మనకు లాభాలే కనపడినప్పటికీ, చివరకు నష్టమే వరిస్తుంది . రావణుని విషయంలో అదే జరిగింది. సీతాపహరణం విషయంలో రాక్షసులకు పరస్త్రీలను అపహరించడం ధర్మమే అన్నాడు. తన నెదిరించేవారు ముల్లోకాలలోనూ లేరనే గర్వంతో మసిలాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు. తనకే కాక, లంకకే నాశనం తెచ్చాడు. ఈనాడు కూడా అలాంటివారు ఉన్నారు. నాటి హర్షద్ మెహతా నుండి నేటి విజయ్ మాల్య ఉదంతం వరకూ ఇదే. తను చెప్పిందే, చేసిందే ధర్మమనేవారే. నేడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తున్న వారందరికీ ఈ విషయం అర్థమవుతుంది. ధర్మాచరణ అనేది వ్యక్తి నుండే మొదలవ్వాలి. వారందరికీ రాముని జీవితం ఒక ఆచరణీయ పాఠం. ముందు మనం మారాలి. ఏ చిన్న విషయాన్నీ ఉదాసీనంగా నిర్లక్ష్యం చేయకూడదు. రాముడు కష్టాలు పడినట్లు కనిపించినా, ఆయన ధర్మాచరణ ముందు అవన్నీ తేలిపోయాయి. ధర్మాచరణ, కర్తవ్యనిర్వహణమే మనిషికి శాంతిని, నిర్మలత్వాన్ని ఇస్తుంది. అటువంటివాడు ఎవ్వరికీ భయపడనక్కరలేదు. అదే వేయి ఏనుగుల బలము.

ఆ జగదభిరాముడు మనందరకూ ధర్మాచరణకు కావలసిన సంకల్ప బలాన్ని ఇచ్చుగాక !

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ