మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించినది మొదలు సుఖమయ, శాంతిమయ జీవనానికి కృషి చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ప్రయోగాలు సలుపుతూనే ఉన్నాడు. వేదాలకు పుట్టినిల్లు అయిన ఈ భరత ఖండం లో ఋషులు, మునులు తమ తపశ్శక్తి తో మానవజీవితాన్ని , ఆత్మానుభూతిని దర్శించి, మనిషి ఎలా బ్రతికితే శాంతిగా ఉంటాడో తెలియచెప్పారు. మన పవిత్ర గ్రంధాలన్నీ ఋషి ప్రోక్తమైనవే.మన భారత దేశాన్ని మిగతా అన్ని దేశాల కంటే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది ధర్మం పట్ల మనకున్న గాఢానురక్తి. ఋషులు ఏర్పరిచిన ఈ వర్ణాశ్రమ ధర్మాలను ధర్మం అనే చెలియలి కట్ట కు లోబడి పాటిస్తూ ఉంటే మానవ జీవితం సాఫల్యమైనట్లే. ఆశ్రమ ధర్మాలలో కెల్లా ఉత్తమమైన గృహస్థాశ్రమం యొక్క విశిష్టతని వాల్మీకి మహర్షి దర్శించి, రామకథగా రామాయణం రూపంలో మనకందించారు. “ రామో విగ్రహవాన్ ధర్మః “ అన్నట్లు రాముడే పోతపోసిన ధర్మమూర్తి. రాముడి జీవితాన్ని పరిశీలిస్తే, అనుసరిస్తే, అనుగమిస్తే అంతకన్నా మోక్షం ఇంకేదీ లేదు. మిగతా అవతారాలన్నింటి కన్నా మానవ జీవితానికి అతి దగ్గరగా ఉన్నది రామావతారమే.మిగతా అవతారాలు భగవంతుని వైభవాన్ని కీర్తించడానికి ఉపయోగపడితే, రామావతారం మనం ఆచరించడానికి వీలుగా ఉన్న ధర్మాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

ఈ సమాజంలో సన్యాస దీక్ష తీసుకున్న ఏ అతి కొద్దిమందినో మినహాయిస్తే, మిగతా వారందరం గృహస్థాశ్రమం లోని వారమే. అందరం అనేక రాగ ద్వేషాలకు లోనవుతూ, కుటుంబ పరంగా, సామాజికంగా బంధాలనేర్పరుచుకుంటూ, అనేక సంఘర్షణలకు గురవుతుంటాము. మనకి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేకానేక సంక్లిష్ట పరిస్థితులలో, సందర్భాలలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామాలు వస్తాయో అని సతమతమవుతూ ఉంటాము. అలాంటప్పుడు మనకి ముందే ఒక మార్గం చూపించిన వారెవరున్నారా, వారు ఈ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించేరా అని అన్వేషిస్తూ ఉంటాము. ఆ సందర్భంలో నువ్వు ఇలా చెయ్యి, అలా ప్రవర్తించు అనే చెప్పేవాళ్ళు, గ్రంథాలు బోలెడు ఉంటాయి. ఒడ్డున కూర్చున్న వాడికేం తెలుస్తుంది నది లోతెంతో అని అనుభవించే వాళ్లకి అనిపిస్తుంది. అదిగో , అలాంటి సందర్భంలోనే మనకి శ్రీరామాయణం నేనున్నానంటూ వస్తుంది. మనందరం ఈనాడు అనుభవించే సంఘర్షణలన్నీ, ఉద్వేగాలన్నీ తానే అనుభవించి, ఆయా సందర్భాలలో ఏ నిర్ణయం తీసుకుంటే ధర్మం కాపాడబడుతుందో, ఆచరించే ఆ ధర్మమే తిరిగి మనలని ఏ విధంగా కాపాడుతుందో తన జీవితం ద్వారా తెలియచెప్పిన ధర్మమూర్తి, మహనీయుడు శ్రీరామచంద్రమూర్తి. ప్రతీ మనిషి జీవితంలో అడుగడుగునా ఏర్పడే ప్రతీ సంఘర్షణకీ రామాయణం తరచి చూసిన వారికి పరిష్కారం దొరుకుతుంది. భగవద్గీత కూడా మనిషికి ఎలా జీవించాలో చెప్పినా రామాయణం ప్రాక్టికల్ గైడ్ లాంటిది. భగవద్గీత లో చెప్పిన కర్మయోగాన్ని తాను అనుష్ఠించి, మనకి ఆదర్శప్రాయుడైన కర్మయోగి రాముడు. ఇందులో మనిషి ఆచరించలేని, కష్టసాధ్య మైన గుణాలు ఏమీ లేవు. ధర్మమంటే అదేదో బ్రహ్మ పదార్థమన్నట్లు చెప్పలేదు. సులువుగా ఆచరించగలిగేవే ఉన్నాయి. కావలసినదల్లా ధర్మం పట్ల అనురక్తి. ఒక ధర్మం, మరొక ధర్మం మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు, ఏది పరమ ధర్మమో అదే ఆచరించాలి. ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు కష్టమైనప్పటికీ, ధర్మాన్నే ఆచరించాలి. ఇష్టమైనదని, సులువైనదని, తాత్కాలికంగా సుఖాన్నిస్తుందని అధర్మాన్ని ఆచరించరాదు. అదే రామాయణం మనకి నేర్పే జీవిత సత్యం. వ్యక్తి హితం కన్నా కుటుంబ హితం, కుటుంబం కన్నా సమాజ హితం మహోన్నతమైనవి అని రాముడు తన జీవితం ద్వారా చాటి చెప్పాడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని, రాజ్యం లోని సామాన్య పౌరుల మాట కోసం భార్యని, విడచిపెట్టాడే తప్ప ధర్మాన్ని వీడలేదు. రాముడిని ప్రజలు దశరథమహారాజు కొడుకుగా, కాబోయే రాజుగా మాత్రమే ఆరాధించలేదు. యువరాజు అవుతాడన్నప్పుడూ అదే ఆరాధన. అడవుల పాలైనప్పుడూ అదే ఆరాధన. సీత ని పోగొట్టుకొని దుఃఖం అనుభవిస్తున్నప్పుడూ అదే ఆరాధన. రావణ సంహారం చేసినప్పుడూ అదే ఆరాధన. రాముని స్థితిగతులకు అతీతంగా ఈ ఆరాధన కొనసాగింది. నిజానికి అది రాముని పట్ల ఆరాధన కన్నా, మూర్తీభవించిన ధర్మం పట్ల ఆరాధన.

వాల్మికి మహర్షి , నారద మహామునిని వేసిన ఒకే ఒక ప్రశ్న రామాయణాన్ని మనకి అందించింది. వాల్మికి మహర్షి, తను ఉన్న కాలంలో షోడశ గుణాలు కల ఒక మానవుడు ఈ భూమ్మీద ఉన్నాడా అని ప్రశ్నించినప్పుడు, నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని ఉపదేశిస్తారు.

కోన్వస్మిన్ సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్,
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః .
చారిత్రేణ చ కో యుక్తః సర్వ భూతేషు కో హితః,
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః .
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ఽనసూయకః
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే.

పరాక్రమశాలియు, గుణవంతుడు, ధర్మాధర్మముల నెరిగినవాడు, మేలు మరువని వాడు, ఆడినమాట తప్పనివాడు, తలచిన పని నేరవేరువరకు పట్టుదల విడువని వాడు,మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతముల మేలుకోరువాడు, మంచి చెడ్డ లెరిగిన వాడు, నేర్పరి, అందరికీ ప్రియమైన దర్శనం కలవాడు, ధైర్యవంతుడు, కోపము లేని వాడు, కాంతితో కూడిన వాడు, ఇతరులపై అసూయ లేనివాడు, యుద్ధం లో దేవతలనైన వెరపించేవాడు.

పదహారు కళలు చంద్రుని పూర్ణ చంద్రుణ్ణి చేసినట్లు ఈ పదహారు గుణాలు రాముణ్ణి పూర్ణ పురుషుడిని, పురాణ పురుషుడిని చేసాయి.

శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు నుండీ మనం రాముని ఏ గుణాలు ఆయనను ఆదర్శప్రాయుడినీ, ఆరాధ్యనీయుడినీ చేసాయో, ఏ గుణాలు ఎన్ని యుగాలు మారినా రామ కథ నిత్యమూ పారాయణ చేయతగిన గ్రంథంగా కొలవడానికి కారణమయ్యాయో, ఆ గుణాలు మన నిత్యజీవితంలో ఎలా ఆచరణ యోగ్యమో తెలుసుకుందాం.

శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి |
శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే ||

#srirama #sriramanavami #meepurohit #purnapurushudu #ramayanam #purnapurushudusriramachandrudu