పుంసాం మోహనరూపాయ – పుణ్యస్వరూపాయ

కొంత మందిని చూడగానే మనసులో ఒక ఆదర, ఆత్మీయ భావం కలుగుతుంది. మరికొంతమంది ని చూస్తే అకారణంగానే వారి సమక్షంలో ఉండాలనిపించదు. దానికి కారణం వారి బాహ్య సౌందర్యం కాదు. ఒక వ్యక్తి యొక్క అంతః సౌందర్యం వారి మనసులో ఉన్న స్వచ్చత, నైర్మల్యం, మరియు సాటి మనుషుల పట్ల వారికి ఉన్న ప్రేమ ద్వారా ప్రకటితమవుతూ, మనం వారి పట్ల ఆకర్షితులవడానికి కారణమవుతూ ఉంటుంది. రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, కంచి పరమాచార్య మొదలైన వారి అంతఃసౌందర్యం చేతనే ప్రజలందరూ వారి పట్ల ఆకర్షితులై వారి బోధలు శ్రద్ధగా వినేవారు. వీళ్ళందరకూ కూడా ఆదర్శప్రాయుడైన వ్యక్తి, ఎన్ని యుగాలు మారినా, తలుచుకున్న వెంటనే మన మనసులలో ఇప్పటికీ భక్తి భావంతో పాటు, ఆత్మీయభావం పుట్టించేవాడు, ఊరూరా, వాడవాడలా కుల మత భేదాలకు అతీతంగా కొలుచుకునే వాడు అయిన శ్రీరామచంద్రమూర్తి. ఒక హాస్పిటలో, స్కూలో లేని ఊరు ఉండచ్చేమో గానీ, రామాలయం లేని ఊరు, రాముని కొలవనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. శ్రీరాముడు దేవుడి కంటే కూడా ఆదర్శప్రాయుడైన మానవుడిగానే మన మనసులలో కొలువున్నాడు. దానికి కారణం ఆయన రామావతారంలో ఎలాంటి దైవ మహిమలు ప్రదర్శించలేదు.
అయోధ్యలో ప్రజలందరూ కూడా రాముని చూడగానే పులకించిపోయేవారు. దానికి కారణం రాముడు ఎలాంటి భేద భావం చూపకుండా, ఎవరిని చూసినా సరే, వారే ముందు పలకరించాలని అనుకునేవాడు కాదు. తానే ముందు చిరునవ్వుతో పలకరించేవాడు. ఎవరికైనా బాధ కలిగితే, ఒక తల్లి కన్నా ఎక్కువగా తనకే కలిగినంత బాధపడేవాడు. ఎవరికైనా సంతోషము కలిగితే ఒక తండ్రిలా తాను కూడా వారితో సంతోషపడేవాడు. చంద్రుని చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, రాముడిని చూస్తే అంతకన్నా ఎక్కువ ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే రాముడు శ్రీరామచంద్రుడు అయ్యాడు.

రామదర్శన మాత్రం చేతనే శాప విమోచనం కలిగిందిఅహల్యకి, రాముణ్ణి చూసి తరించడం కోసమే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసుకుంటూ జీవించి ఉంది శబరి, రాముని స్పర్శ చేతనే శాప విముక్తి పొందారు విరాధుడు, కబంధుడు. ఆ యుగంలోనే కాదు, ఈ యుగములో కూడా రాముని దర్శనం చేత పునీతులైన వారు ఎందరో ఉన్నారు. త్యాగయ్య, రామదాసు, వంటి భక్తులెందరో రాముణ్ణి దర్శించి తరించారు.

ఈ కాలంలో పిల్లలు గురువుల యెడ ఎంత గౌరవం, భక్తి చూపాలో రాముణ్ణి చూసి నేర్చుకోవచ్చు. గురువుల యెడ ఎలా ప్రవర్తించాలో, వారి వద్ద నుండి జ్ఞాన సముపార్జన ఎలా చేయాలో శ్రీరాముడు తన నడవడి ద్వారా తెలిపాడు. వసిష్టుని వద్ద ఎంతో శ్రద్ధగా అన్ని శాస్త్రాలూ నేర్చుకున్నప్పటికీ, యాగ సంరక్షణకై విశ్వామిత్రుని వద్దకు వెళ్ళినప్పుడు, తాను స్వయంగా రాజకుమారుడు ఐనప్పటికీ ఆ దర్పాన్ని ఏ మాత్రం చూపక, ఆయన వెంట కాలినడకన తిరుగుతూ తాటకా జన్మ వృత్తాంతం, గంగావతరణం, సిద్ధాశ్రమం, అహల్యా శాపవృత్తాంతం మొదలైన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆయనకు సేవ చేస్తూ, ఆయన అభిమానానికి పాత్రుడై, అనేకానేక అస్త్రశస్త్రాలను సంపాదించాడు. పెద్దల యెడ వినయంతో ప్రవర్తించేవాడు. వారికి ఏమైనా సహాయం, సేవ కావాలన్నా ముందు వెనుకలు చూడకుండా చేసేవాడు. తీరిక సమయాలలో పెద్దల సమక్షంలో కూర్చుని ధార్మిక విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఈనాడు పిల్లలు తల్లితండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దలపట్ల గౌరవం, భక్తి లేకుండా వాళ్ళను ఎదిరించడం, సమాధానం చెప్పడం లాంటివి చేస్తున్నారు. దానివల్ల వారు జీవితంలో ఉత్తమమైన పౌరులుగా ఎదగలేకపోతున్నారు. జిజియాబాయి ఎలాగైతే చిన్నప్పటినుండీ రామాయణ, మహాభారతాలు చెప్పి ఒక శివాజీని తయారుచేసిందో, అలాగే మన పిల్లలను కూడా రామాయణాన్ని, వాళ్ళ నిత్య జీవితంలో ఒక భాగంగా తయారు చేస్తే, ప్రతి ఒక్క బాలుడూ, బాలికా శివాజీ అంత పరాక్రమంగా అంతటి సుగుణాలతో తయారవుతారనడంలో సందేహం లేదు.

మనందరమూ ఏదైనా సరే ఉచితంగా దొరుకుతోంది అంటే, ఇస్తున్నారు కదా తీసుకుంటే తప్పేమిటి అనే ధోరణిలో ఉంటున్నాము. ఏదైనా తనకు అర్హమైనది తనంత తాను సంపాదించుకోవాలే గానీ, అయాచితంగా వచ్చిన దాన్ని స్వీకరించరాదని రాముని సిద్ధాంతం, అందుకే శరభంగ ముని, సుతీక్ష్ణ ముని ఇవ్వచూపిన పుణ్య లోకాలను తిరస్కరించాడు. ఇక్కడ రాముడు స్వశక్తి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాడు. స్వశక్తి నే నమ్ముకొని మనం కార్యాలు సాధించుకోవాలి గానీ ఇతరుల నుండి అయాచితంగా లభించేదాని కోసం ఆశపడకూడదు. సుగ్రీవునితో అగ్నిసాక్షిగా స్నేహం చేసి, ముందు తానే సుగ్రీవునికి సహాయం చేసి, అప్పుడు, రాక్షసులతో పోలిస్తే అతి చిన్న ప్రాణులైన వానర సైన్యాన్ని తన వెనకనుంచుకొని, రాముడు తన స్వశక్తితోనే రావణ సంహారం చేసాడు. అలాగే మనం పిల్లలకి చిన్నతనం నుండీ రాముని ఈ సులక్షణాలని తెలియ చేసి , వారి చేత పాటింప చేస్తే వారు ఉత్తమ పౌరులుగా తయారవుతారు.