కార్యసాధకుడు – కౌసల్యాతనయుడు

మనలో చాలామందిమి ఏదైనా ఒక సత్కార్యం లేదా ఒక లక్ష్యం సాధించాలనే సంకల్పంతో అట్టహాసంగా మొదలుపెట్టేస్తుంటాము. భర్తృహరి “ఆరంభించరు నీచ మానవులు “ అనే శ్లోకంలో అన్నట్లు ఏదైనా అవాంతరం కలిగినప్పుడో, లేదా కష్టనష్టాలు ఎదురైనప్పుడో, మనం ఆ పని చేయలేమని విడిచిపెట్టేస్తుంటాము. ఆ పని చేయకపోవడానికి కారణాలు వెతికి, ఇదిగో ఫలానా కారణం వల్ల చేయట్లేదని, మనల్ని మనం సమర్థించుకుంటుంటాము. కానీ ఉత్తములు పట్టిన పట్టు విడవకుండా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ కార్యాన్ని పూర్తిచేస్తారు. ఇక పురుషోత్తముడైన రాముడిని గురించి ప్రత్యేకంగా చెప్పాలా?

స్థూలంగా చూస్తే రామాయణ కథ పితృవాక్య పరిపాలన కోసం రాముని వనవాసం, తన భార్యను అపహరించిన రావణ వధ. ఇది రామాయణం ఒక కథగా మాత్రమే చదివినవారికి, విన్నవారికి తెలిసేది. కానీ రామాయణం ఒక మహోత్కృష్టమైన కావ్యం.

ఒక కార్యాన్ని ఎలా సంకల్పించాలో, సంకల్పించిన కార్యసిద్ధికి ఏ మార్గం అవలంబించాలో, దానికి తగిన వనరులు ఎలా సమకూర్చుకోవాలో, తగిన ప్రణాళికతో సరైన సమయం కోసం ఎలా ఓర్పుతో వేచి ఉండాలో, ఎన్ని పరీక్షలు వచ్చినా తట్టుకొని, ధైర్యాన్ని విడువకుండా ధర్మమార్గంలో కార్యాన్ని ఎలా సాధించాలో రాముడు తన జీవితం ద్వారా చూపించాడు. అందుకే రాముడు నడిచిన మార్గం రామాయణం అయింది.

విశ్వామిత్ర యాగసంరక్షణకై వెళ్ళిన రామలక్ష్మణులు, జనావాసాలలో రాక్షసులు చేస్తున్న అకృత్యాలను విశ్వామిత్రుని ద్వారా విని ఉన్నారు. కేవలం తాటక, మారీచ, సుబాహులను పడగొట్టి, యాగ రక్షణ చేయడంతోనే తమ కార్యం పూర్తి అయ్యిందని భావించలేదు. విశ్వామిత్రుని ద్వారా తమ ఇక్ష్వాకువంశ పూర్వీకుడైన భగీరథుని ప్రయత్నాన్ని, గంగావతరణము కథను తెలుసుకుని ప్రేరణ పొందిన రాముడు, తన వంశప్రతిష్టను మరింత ముందుకు తీసుకువెళ్ళాడు. ఈ భూమండలంలో ప్రజల పట్ల అకృత్యాలు చేస్తున్న రాక్షసులను మట్టుపెట్టి, అధర్మాన్ని రూపుమాపి, తన అవతార ప్రయోజనమైన ధర్మ స్థాపన చేస్తాడు. దానికి కావలసిన వనరులైన అస్త్రశస్త్రాలను విశ్వామిత్రుని వద్దనుండి స్వీకరించాడు. అయోధ్యలో కూర్చుని రాజ్యపాలన చేస్తే ఆ కార్యం సఫలమవదు. అది సఫలమవ్వాలంటే జనావాసాలలో, మునుల ఆశ్రమాల సమీపాలలో సంచరిస్తూ, వారి బాధలు స్వయంగా తెలుసుకుని, రాక్షసులే తన వద్దకు వచ్చే అవకాశం కల్పించుకోవడం కోసమే వనవాసం. మరి దీని వెనకాల కైక వరాలు అడగడం, దశరథుని విలాపం, వనవాస ప్రయత్నం ఇంత కథ ఎందుకూ అంటే దీని వెనుక మనకో సందేశం ఉంది. ఉత్థానపతనాలు అనేవి ప్రతీ ఒక్కరి జీవితంలో సంభవించేవే అని, అప్పటివరకూ ఎంతో ఉన్నతస్థానంలో ఉన్నప్పటికీ, విధి వైపరీత్యం వల్ల క్రిందకు పడవలసిన పరిస్థితే వస్తే, మనం ఆ ప్రతికూల పరిస్థితిని దైవ నిర్ణయంగా భావించి ఎలా శిరసావహించాలో, అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనం ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎలా పోరాడాలో తెలియచేసేందుకే ఈ సందర్భం. ఈ మహత్కార్య సాధనలో మంథర నుండి భరతుని వరకూ రామునికి తోడ్పడినవారే. రాక్షస వధ అనేది ఒక మహోన్నతమైన యజ్ఞం. ఏ యజ్ఞమైనా ధర్మపత్ని లేనిదే చేయరాదు పైగా రావణుని మట్టుపెట్టాలంటే సీతాపహరణమనే బలమైన కారణం ఉండాలి కాబట్టి, సీతమ్మ కూడా వనవాసం చేసింది. ఇక రాముని బహి:ప్రాణం లక్ష్మణుడు. రామునికి తోడుగా, ఆయన్ని సేవించుకునే అనుంగు సోదరుడిగా, సర్వకాలములలోనూ ఆయన నీడగా ఉన్నాడు లక్ష్మణుడు.

వనవాస సమయంలోనూ, రాముడు అయోధ్యలో భోగములు అనుభవించడం లేదే అని ఏనాడూ బాధ పడలేదు. వనవాసం లోని స్వేచ్చని, ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగాడు. తద్వారా, కార్య సాధనలో మనము సుఖ పడటానికి ఆస్కారం ఉండదు, కష్టం లోనే సుఖం, సంతోషం వెతుక్కోవాలి అని బోధించాడు. అలాంటి సమయాలలో మన సంకల్పమే మనని ముందుకు నడపాలని చేసి చూపించాడు. రాక్షసులని మట్టుపెట్టడానికి తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ఒక్క రోజులోనే 14,౦౦౦ మంది రాక్షసులని సంహరించి, తన పరాక్రమం చూపించిన ధీరోదాత్తుడు రాముడు. రామునిది జగత్కళ్యాణమైన కార్యం. ఈ రామకార్యం కోసం జటాయువు, సంపాతి మొదలైన పక్షులు, మైనాకుడు మొదలైన పర్వతాలు దగ్గరనుండీ, ప్రతీ ఒక్కరూ సాయం చేసారు. ఇక వానరులు, భల్లూకముల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? రామునికి సీతాన్వేషణ సమయంలోనే కాదు, యుద్ధ సమయంలోనూ ఎన్నో ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. ఇంద్రజిత్తు మాయా సీతను సంహరించడం, ఇంద్రజిత్తు మాయోపాయానికి లక్ష్మణుడుతో సహా అందరూ మూర్చిల్లడం వంటివి ఎన్నో ఎదురైనా, ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకుండా లక్ష్యాన్ని సాధించాడు. మానవప్రయత్నం ఎంత ఉన్నతంగా ఉన్నా, దైవ బలం కూడా కలిసి రావాలని, ఆ దైవశక్తి సాయంకోసం దేవుని పూజించాలి అని, అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్యహృదయాన్ని తొలిగా పఠించిన మహాపురుషుడు రాముడు. దీనిని బట్టి మానవ ప్రయత్నానికి, దైవబలం తోడైతే ఎంతటి అద్భుత కార్యాలు సాధించవచ్చో నిరూపించిన ఉత్తమోత్తమ గ్రంథం రామాయణం.

అటువంటి రామాయణాన్ని మన జీవితంలో అంత్యదశ లోనో, అధ్యాత్మికంగానో చదవాల్సిన గ్రంథంగా కాక చిన్నతనం నుండీ చదివి, అర్థం చేసుకుని, ఆకళింపు చేసుకుని, ఆచరణలో పెట్టాల్సిన మార్గదర్శన గ్రంథంగా ప్రతీఒక్కరి ఇంటిలోనూ ఉంచుకోవాలి. రామాయణం ఎన్నాళ్ళైతే ప్రతీ ఇంటిలోనూ చదవబడుతుందో , వినబడుతుందో అన్నాళ్ళు మానవత్వం పరిఢవిల్లుతుంది అన్న మహర్షి వాక్యాలు అప్పుడే నిజమవుతాయి.

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||