ఆర్తత్రాణ పరాయణుడు – అందరిబంధువు

లోకంలో ఎవరైనా తమకి ఉపకారము చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుని, తిరిగి అవకాశము కలిగినప్పుడు ప్రత్యుపకారం చేసేవాళ్ళు బహు కొద్దిమంది ఉంటారు. ఏరు దాటేక తెప్పతగలేసిన చందాన తమ అవసరం తీరగానే వారిని గురించి మర్చిపోయేవారే ఎక్కువమంది. కొన్ని కొన్ని సందర్భాలలో మనం మనవాళ్ళే కదా, ఫరవాలేదు అనీ, నేను వీళ్ళకి చెప్పేదేమిటి అనే అతిశయంతోనూ కృతజ్ఞతలు చెప్పము. ఇంకొన్ని సార్లు సహాయం చేయడానికి కూడా అవకాశం కుదరలేదనో, సమయం లేదనో, ఇలా వంకలు పెట్టి తప్పించుకోజూస్తాము. ఇలాంటివారందరికీ రాముని జీవితం ఒక పాఠం. మన దాకా ఎందుకు, రామాయణం లోనే సుగ్రీవుడు కూడా రాముడు చేసిన మేలును మరిచి, భోగాలలో తేలుతూ, రాముని కోపాగ్నికి గురవ్వబోయే సమయంలో హనుమంతుడు మరియు తారల సమయస్ఫూర్తి వల్ల ఆ గండం నుండి బయట పడ్డాడు.

రామాయణంలో రాముని వల్ల ఉద్ధరింపబడిన వారే కాదు, రామకార్యం స్వకార్యంగా భావించి మహదానందంతో చేసిన వారిలో హనుమంతుని మొదలు గుహుడు, జటాయువు, మాటసాయం చేసిన మునులు, గంధర్వులు ఇలా ఎంతమందో ఉన్నారు. వారెవ్వరినీ రాముడు మరువలేదు. చేసినది ఎంత చిన్న సాయమైనప్పటికీ, పేరుపేరునా అందరికీ తగిన రీతిలో సాయమందించాడు. భిన్న జాతుల వారందరినీ, సమానంగానే ఆదరించాడు. సర్వ భూతముల యందునూ ఒకేరకమైన ఆదరబుద్ధిని చూపించాడు. వీరు అల్పమైన వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు అనే భేద భావం చూపించలేదు. తనకు అరణ్య వాసంలో మార్గనిర్దేశం చేసిన భరద్వాజుడు, అత్రి, శరభంగుడు, సుతీక్ష్ణుడు మొదలైన మునులపట్ల ఎంత కృతజ్ఞత చూపించాడో, నిషాదుడైన (బోయవాడు) గుహుని పట్ల కూడా అంతే కృతజ్ఞత చూపించాడు. వారిని బాధిస్తున్న రాక్షసులను చంపి, వారికి సంతోషాన్ని కలుగచేసాడు. పైగా క్షత్రియునిగా తన రాజ్యంలో ఉన్న మునులను, బ్రాహ్మణులను కాపాడటం తన బాధ్యతగా భావించాడు.

అంతేగాకుండా, పక్షి అయినప్పటికీ సీతను ఎత్తుకుపోతున్న రావణాసురుని అడ్డగించి పోరాడి అవసాన దశలో ఉన్న జటాయువుకి మరణం తర్వాత ఉత్తర క్రియలు జరిపించి, తన కృతజ్ఞతను చాటుకున్నాడు. రావణ వధకు ఉపాయాన్ని చెప్పిన విభీషణుని లంకా రాజ్యాధిపతిని చేసాడు. వానరులకు అనేకానేక బహుమానాలు ఇచ్చాడు.

చేసినమేలు మనం మరిచిపోతే తరువాత మనకి అవసరమైనప్పుడు ఎవరూ అక్కరకు రారు. ఉపకారమును గుర్తుపెట్టుకుని ప్రవర్తించేవారిని అందరూ ఆమోదిస్తారు. మానవుడై పుట్టినందుకు తోటి మానవుడికి సాయం చేయడం మన ధర్మం. చేసిన సాయానికి ప్రత్యుపకారమో, మాట సాయమో చేయవచ్చు. అప్పుడు మానవత్వం పెంపొందుతుంది.

రాముడు అన్నిరకాల ప్రాణుల యందునూ ఒకేరకమైన దయ కలిగి ఉన్నాడు. వేట క్షత్రియునికి సహజ ధర్మమైనప్పటికీ, రాముని మనసు వేట యందు లేదు. తన వినోదం కోసం నిష్కారణంగా ఒక ప్రాణిని చంపడం రామునికి ఇష్టం లేదు, అయితే ధర్మం ప్రకారం కొన్ని కొన్ని హోమాలలో, వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని జంతువులను వేటాడటం శాస్త్ర సమ్మతం కాబట్టి ఆయా జంతువులను మాత్రం సంహరించేవాడు. వానరులైనప్పటికీ, తనతో సమానంగా ఆదరించాడు. భల్లూకములు, ఇంకా ఇతర జంతువులనూ అంతే సమానంగా ఆదరించాడు. పశుపక్ష్యాదులే కాదు, సమస్త జీవరాశినీ కూడా రాముడు అనవసరంగా బాధించేవాడు కాదు. అరణ్య వాసంలో తన పర్ణశాలలు కూడా ఏ ఇతర ప్రాణులకూ, వృక్ష జాతికీ కూడా ఇబ్బంది కలుగని విధంగా నిర్మించుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తరువాత కూడా పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈనాడు కూడా ‘వేగాన్స్’ పేరుతో ఆహారం కొరకు జంతువుల్ని వాడొద్దు అని కొందరు ప్రచారం చేస్తుంటే, ఇంకొకవైపు గోవధ, ఇంకా ఇతర వన్యప్రాణులైన జింక, దుప్పి, నెమళ్ళు వంటివి వినోదం కోసమో, ఆహారం కోసమో చంపడం కూడా మనకి కొత్త కాదు. చంపడం ఒకటే కాదు వినోదం కోసం వాటిని సర్కస్ మొదలైన వాటిలో కూడా వాడడం మంచిది కాదు. వాటిలో కూడా మనలో ఉండే ప్రాణమే ఉంటుంది, మనకి బాధ కలిగినట్లే వాటికీ కలుగుతుంది అని గుర్తెరిగిన నాడు మనం ఏ జంతువునీ సరదాకి కూడా హింసించము. జంతువులే కాదు, వృక్షాలు, మొక్కలకీ కూడా ప్రాణం ఉంటుందనీ, ఇంకా కొందరు సైంటిస్టులు వాటికి కూడా ఉద్వేగాలు ఉంటాయినీ నిరూపించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అపార్ట్ మెంట్లు , షాపింగ్ మాల్స్, అభివృద్ధి పేరుతో చెట్లుకొట్టడం ఉండదు. పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళమూ అవుతాము. అన్ని జీవరాసులూ ప్రకృతిలో సమతౌల్యం పాటించదానికే ఆవిర్భవించాయన్న సూత్రం గుర్తుంచుకుని, ప్రకృతికి అనుగుణంగా నడచుకుంటే రామరాజ్యమే.

రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమః ||