అక్షయతృతీయ

వైశాఖ శుద్ధ తదియను ‘ అక్షయ ‘ తృతీయగా వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశం లేకపోవడం. దినదినాభివృద్ది చెందడం కూడా.

అక్షయ తృతీయరోజే చతుర్యుగాలలో మొదటిదైన కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి. ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట! నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే! కాబట్టే అక్షయ తృతీయ నాడు…రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా,ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.

అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొంటే అక్షయమౌతుందని నమ్మకం. ఈ విషయంలో పెద్దలు కొన్ని మినహాయింపులిచ్చారు. బంగారం కొనగలిగే శక్తి లేకపోతే … వెండి కొన్నా మంచిదేనట. అదీ కొనలేమనుకుంటే ఉప్పు కొన్నా ఫర్వాలేదుట! ఎందుకంటే లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజతనయ. కనుక సముద్ర జలాల నుంచి తయారయ్యే ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపమేనంటారు.

అక్షయ తృతీయ రోజు సత్కార్యాలు చేయడం ద్వారా మంచిని అక్షయం చేసుకోవచ్చు.

అసలే వేసవి కాలం. ఎండలు మండుతున్నాయి. నలుగురు యాచకులకు చెప్పులో, గొడుగులో, దానం చేయవచ్చు. చల్లని మజ్జిగతోనో, పానకంతోనో పది మంది గొంతు తడపొచ్చు. ఈరోజున విష్ణు మూర్తికి చందన లేపనం చేసిన వారికి మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు, శ్రీ మహావిష్ణువును కృష్ణ తులసి దళాలతో అర్చించడం విష్ణువుకు మహా ప్రీతిదాయకం. అక్షయ తృతీయ రోజున మహావిష్ణు ప్రీతిగా విష్ణు అర్చన, సహస్రనామ పారాయణ చేసి, వడపప్పు, పానకం దానం చెయ్యడం మంచిది. వేసవి ముదురుతూ ఉంటుంది కాబట్టి, నీరు, పలుచని మజ్జిగ, చెప్పులు, వస్త్రము, గొడుగు, బెల్లం, మొదలైనవి కూడా దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది అని పెద్దల ఉవాచ. కొంతమంది ఈ మాసంలో వచ్చే మామిడి పళ్ళను, ఒక విసనకర్రతో పాటు దక్షిణ తాంబూల సహితంగా బ్రాహ్మణులకు దానం చేస్తారు.

అక్షయతృతీయప్రాముఖ్యత:

1. పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం

అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి.